డబ్బు మనిషి అవసరం తీరుస్తుంది. అదే డబ్బు మనిషిని అథపాతాళానికి తొక్కేస్తుంది. పైసా ఎంత సంపాదించావన్నది ముఖ్యం కాదు.. దాన్ని ఎలా సంపాదించావన్నదే ముఖ్యం. అయితే ఈ కాలంలో కాయాకష్టం చేసి సంపాదించే కన్నా.. ఈజీ మనీ కోసం వెంపర్లాడే జనమే ఎక్కువైపోయారు. ముఖ్యంగా యువత ఈజీ మనీకి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటోంది. కొందరైతే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇంతకీ ఈ పరిస్థితికి కారకులెవరు? జనాన్ని ఈజీ మనీ ఉచ్చులోకి లాగి వారి జీవితాలను బుగ్గి పాలు చేయడం వెనుక ఎవరున్నారు?సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. అందులో మంచిని స్వీకరిస్తే పర్లేదు.. కానీ చెడువైపు మొగ్గితేనే ఇబ్బందంతా. ఈ మధ్యకాలంలో యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రాం ఇలా ఏ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసినా బెట్టింగ్ యాప్స్ దర్శనమిస్తున్నాయి.