కండక్టర్ ఓవర్ యాక్షన్..! - Tv9

నిజామాబాద్ జిల్లా బోధన్ డిపో పరిధిలో టి ఎస్ ఆర్ టి సి బస్సు కండక్టర్ నరసింహులు టికెట్ తీసుకోమని ఒక మహిళను కోరాడు. ఉచిత ప్రయాణ సౌలభ్యం ఉన్నా దానిని లెక్కలోకి తీసుకోకుండా సదరు మహిళను టికెట్ తీసుకోవాల్సిందే అన్నాడు. ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని తీసుకొచ్చిందని వాదించినా సరే ఏమాత్రం పట్టించుకోలేదు. మహిళా ప్రయాణికురాలి నుంచి 90 రూపాయిల ఛార్జీ వసూలు చేశాడు. ఓ ప్రయాణికుడు గమనించి కండక్టర్‌ నిర్వాకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్తా తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దాకా వెళ్లింది. వెంటనే స్పందించిన ఆయన సీరియస్‌ అయ్యారు. కండక్టర్‌ను డిపో స్పేర్‌లో ఉంచామని, ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. విచారణ తర్వాత శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ తెలిపారు.