కారు, ఇల్లు తరహాలో మన శరీరంలోని అవయవాలూ క్రమంగా క్షీణతకు లోనవుతుంటాయి. అయితే, ఈ ప్రక్రియలో సారూప్యత ఉండదు. ఒక్కో భాగంలో ఒక్కోలా క్షీణత ఉంటుంది. అందువల్ల వాటి వార్ధక్య రేటు భిన్న రీతుల్లో ఉంటోందని అమెరికాలోని ‘స్టాన్‌ఫర్డ్ మెడిసిన్’ శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే వయసువారితో పోలిస్తే ఒక వ్యక్తిలో ఏదైనా అవయవం వయసు ఎక్కువగా ఉంటే.. అతడిలో ఆ భాగానికి సంబంధించిన వ్యాధి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని తేల్చారు. వారికి అకాల మరణం ముప్పు కూడా ఎక్కువేనని వివరించారు. ఒక సాధారణ రక్తపరీక్ష ఆధారంగా వారిలో అవయవ వార్ధక్య రేటును గుర్తించొచ్చని తేల్చారు. తద్వారా వారిలో వ్యాధి ముప్పును ముందే పసిగట్టవచ్చని తెలిపారు.