ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ ముందు విద్యార్థినులు ధర్నా చేపట్టారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గత కొన్ని రోజులుగా భోజనం సరిగా లేక ఇబ్బందుల పాలవుతున్నామన్నారు. పురుగుల అన్నం తిని ఆరోగ్యంగా ఉండలేకపోతున్నామని, నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. చీఫ్ వార్డెన్‌ను తొలగించి సరైన సౌకర్యాలు కల్పించాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. గతంలోనే సమస్యలు పరిష్కరించాలని విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓయూ లేడీస్ హాస్టల్ డైరెక్టర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.