గాజాలో నెల రోజులకుపైగా హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం సాగిస్తున్న యుద్ధం కీలక దశకు చేరుకుంది. గాజాలో అతిపెద్దదైన అల్–షిఫా ఆసుపత్రిలోకి బుధవారం ఉదయం ఇజ్రాయెల్ సేనలు ప్రవేశించాయి. హమాస్ కమాండ్ సెంటర్ ఇక్కడే భూగర్భంలో ఉందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఆసుపత్రి కింది భాగంలో సొరంగాల్లో హమాస్ నాయకులు మాటు వేశారని చెబుతోంది. మిలిటెంట్లపై కచ్చితమైన, లక్షిత ఆపరేషన్ ప్రారంభించామని ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టింది. ఇక్కడ హమాస్ కమాండ్ సెంటర్ ఉన్నట్లు చెబుతున్న ఐడీఎఫ్ (IDF).. దాన్ని బలపర్చే సాక్ష్యాలను తాజాగా బయటపెట్టింది.